Article as appeared on Vastavam.net

An article on the festivities of March 11th Udayasthamana Seva appeared on http://vastavam.net (an online magazine). Here is a transcript of the article as written by Smt. Radhika Bukka. Photos omitted.

అరిజోనా లోని శ్రీ మహాగణపతి దేవాలయం లో ఉదయాస్తమాన సేవలు 

 

 

 

 

వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన 

వేంకటేశ  సమో దేవో న భూతో న భవిష్యతి 

 ఈ బ్రహ్మాండం అంతట్లో కూడా వేంకటాద్రి ని పోలిన మరొక స్థలం లేదని, అలాగే వెంకటేశ్వర స్వామి ని మించిన దైవం ఇంతకు ముందు లేదు, ఇకపై రాడు అని భవిష్యోత్తర పురాణం లో చెప్పబడింది. తిరుమల గురించి, కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని గురించీ కొత్తగా చెప్పటానికి ఏముంటుంది. ఆపద మొక్కులవాడు అని, భక్తుల పాలిట కొంగుబంగారమని అంటుంటారు. నిరుపేదల నించి అపర కుబేరులవరకు ఆయన ఆపద్భాంధవుడే!!  తొండమాను చక్రవర్తి, కురుంబరతు నంబి చరిత్రలు మనకి తెలిసినవే కదా. తిరుమల కి వెళ్లి శ్రీదేవి , భూదేవి సమేత  మంగళ స్వరూపుడైన శ్రీనివాసుడికి  చేసే ఆర్జిత సేవలలో పాల్గుని తరిద్దామని ఉండని భక్తులు ఉండరు. కాకపోతే, అది అందరికీసాధ్యం అయిన విషయం కాదు. అందునా భరత ఖండానికి దూరం గా విదేశాలలో ఉంటున్న వారికి మరింత కష్టతరం. 

అలాంటిది, అరిజోనా లోని మారికోపా లో ఉన్న శ్రీ మహాగణపతి దేవాలయం లో ఆ అద్భుతమైన అవకాశం కల్పించారు అక్కడి పురోహితులు. ఆలయం లో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం లో నిత్య కళ్యాణం  పచ్చ తోరణం గా జరిగేటటువంటి "ఉదయాస్తమాన సేవల" కైకంర్య సేవలను ఇక్కడి భక్తులకు అందించాలన్న ఆలోచన పురోహితులైన శ్రీ వరపరాకాష్ గారికి రావటం, అది అందరి సహకారం వల్ల  కార్య రూపం దాల్చటం జరిగింది. శ్రీ వరప్రకాష్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాలలో శ్రీ పాంచరాత్ర  ఆగమ ప్రతిష్ఠాన్తం లో నిష్ణాతులు అయ్యారు . వారి ఆధ్వర్యం లో , శ్రీ మహా గణపతి దేవాలయం పురోహితులైన శ్రీ అనిల్  శర్మ గారు మరియు శ్రీ భట్టార్  గార్ల తో పాటు అట్లాంటా హిందూ దేవాలయం నుంచి వచ్చిన  శ్రీ గోవర్ధన్ గారి నిర్వహణలో ఈ అరుదైన "ఉదయాస్తమాన సేవా కైకర్యాలు" అత్యద్భుతం గా , అతి శాస్త్రోక్తం గా మార్చ్ 11 వ తేదీ న జరిగాయి. వందల సంఖ్యల్లో  భక్తులు ఈ సేవలలో పాలుపంచుకుని ఎంతగానో ఆనందపరవశులైయ్యారు. 

 వెంకటాచలం లో ఒకే రోజు ఒకటి లేక రెండు శ్రీవారి ఆర్జిత సేవల కు హాజరు కాగలరేమో కానీ, సుప్రభాత సేవ నించి పవళింపు సేవ వరకూ పాల్గొనగలగటం ఎంతో  అరుదైన విషయము, మఱియు, దాదాపు అసంభవం. అటువంటిది, అన్ని సేవలను ఒకే రోజు చూడగలిగి, పాల్గొనగలిగే అవకాశం అరిజోనా  లోని భక్తులకు కలగటం నిజం గా అదృష్టమే !!

ఉదయాస్తమాన సేవలు ఈ క్రింది విధం గా జరిగాయి

 1. సుప్రభాత సేవ

తర తరాలుగా హైందవ ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతం చేస్తున్నమహత్తర  శ్రీ వేంకటేశ్వరస్తవం ఈ సుప్రభాతం.ఇరువది తొమ్మిది శ్లోకాలు గల సుప్రభాతాన్ని, పదకొండు శ్లోకాలున్నస్తోత్రాన్ని, పదహారు శ్లోకాలున్న ప్రపత్తి ని మరియు పదునాలుగుశ్లోకాలున్న మంగళ శాసనాన్ని 15వ శతాబ్దములో మనవాళమహాముని శిష్యులైన  ప్రతివాద భయంకర అన్నన్ స్వామిరచించారు. ఈ దివ్య గానం ఎక్కడ విన్న మనస్సు తిరుమల క్షేత్రాన్నిచేరుకుంటుంది.

శ్రీ మహాగణపతి ఆలయ పురోహితులు, సుప్రభాత సేవని భక్తుల సమక్షం లో జరిపించారు. 

2. తోమాల సేవ

పుష్పాలంకార ప్రియుడైన శ్రీనివాసుని దివ్య మంగళ మూర్తి కి అనేకపుష్ప మాలికలతో, తులసి మాలలతో చేసే అలంకారమె తోమాలసేవ. ఈ సేవ లో పాల్గొన్న వారి మనస్సు అనే పుష్పం శ్రీ వారి పదాలచెంత చేరి జన్మ ధన్య మవుతుంది.

3. కొలువు

 

 స్నపనమండపం లో శ్రీ వారికి ప్రతి రోజు ఆస్థానం జరుగుతుంది. సన్నిధి లో వున్న కొలువు- శ్రీనివాస మూర్తి ని  ఛత్రచామరాది మర్యాదలతో, మంగళ వాద్య  పురస్సరంగా స్నపనమండపం లో ఉంచిన బంగారు సింహాసనం పై వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామి కి కొలువు నిర్వహించబడుతుంది. ఈ సేవ ను చూసితరించిన వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి స్వామి వారి అనుగ్రహంకలుగు తుంది.

శ్రీ మహా గణపతి ఆలయ అర్చకులు  పంచాంగ శ్రవణాన్ని స్వామి వారికి విన్నవించారు. ఆలయ ట్రెజరీ స్వామి వారి యొక్క లావాదేవీలను  స్వామి వారికి విన్నవించారు. 

 

4.  అష్ట దళ పాద  పద్మారాధన (సువర్ణ పుష్ప అర్చన)

తిరుమల క్షేత్రం లో ప్రతి నిత్యం వెయ్యి నూట ఒక్కటి (1008) సువర్ణపుష్పాలతో, సహస్ర నామాలతో స్వర్ణాలంకార భూషితుడయినా శ్రీవారికి ఈ అర్చన సేవ జరుగు తుంది. శ్రీ వారి అర్చనలో భక్తులుమనస్సు ఏకాగ్రతను పొంది, శ్రీ వారి పాదాల మీద కేంద్రీకరింపబడి, ఆధ్యాత్మిక ఆనందం మరియు లక్ష్మి కటాక్షం కలుగుతుంది. 

5. అభిషేకం

శ్రీ వారి అభిషేకాన్ని దర్శిస్తే చాలు భక్తులు శారీరక, మానసికరుగ్మతలు తొలగి ఆయురారోగ్యములు కలుగుతాయి.  

6. వస్త్రాలంకరణ సేవ

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటిశ్రీనివాసునకు సర్వాంగ సుందరంగా, నయనానంద కరంగా పట్టువస్త్రాలను అలంకరించడమే వస్త్రాలంకరణ సేవ.

7. కల్యాణోత్సవం

శ్రీ దేవి, భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామి (శ్రీ వేంకటేశ్వరస్వామి) వారికి ప్రతి నిత్యం కల్యాణోత్సవం జరుగుతుంది. 15వశతాబ్దములొ తాళ్ళపాక వంశస్థులచే ఈ కల్యాణోత్సవంఆరంభిచబడినట్లు శాసనాల వాళ్ళ తెలుస్తుంది. సర్వ జనులు క్షేమ, స్థైర్య, ధైర్యాదులతో ఉండాలంటే, మహా సంకల్పం తో శ్రీ వారికీకల్యాణోత్సవం చేయటం పరిపాటి. ఈ నిత్య కళ్యాణం వల్లనే శ్రీవారిని కల్యాణ చక్రవర్తి అని, తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లు తున్నది.

8. తిరుప్పవాడ

 

ప్రతి గురువారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి రెండవ అర్చనఅనంతరం జరిగే నివేదనను తిరుప్పావడ సేవ అంటారు.తిరుప్పావడ సేవ లో పాల్గొన్న భక్తులకు నిత్యం అన్నం సమృద్ది గాకలుగుతుంది. పాడి పంటలు వృద్ధి చెందుతాయి.    

    

9. రథోత్సవం

 

 

రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మన విద్యతే |

సకల లోకాధిపతి అయినటువంటి శ్రీ వేంకటేశ్వర స్వామి నిరథోత్సవం లో దర్శించు భాగ్యం వలన మరి యొక్క జన్మ ఉండదుఅని ఆగమ శాస్త్రం చెబుతుంది.

 

10. సహస్ర దీపాలంకరణ సేవ

ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామి వారు, సర్వాలంకారభూషితుడై వైభవోత్సవ మండపం నుండి కొలువు మండపానికివిచ్చేస్తారు. అప్పటికే దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సహస్ర దీపాలమధ్య వున్న ఊయలలో స్వామి వారు ఉభయ దేవేరుల సమేతంగాఆశీనులై, భక్తులకు దర్శనమిస్తారు. ఆ సమయం లో వేదపండితులు వేద మంత్రాలతో స్వామి వారిని కీర్తిస్తారు. నాద స్వరవిద్వాంసులు సుస్వరంగా నాదస్వరాన్ని విని పిస్తారు. అనంతరంగాయకులు అన్నమాచార్యుల సంకీర్తనలతో, పురందర దాసుకీర్తనలతో శ్రీ వారికి స్వరార్చన చేస్తారు. వేద, నాద, గానాలనుఆలకిస్తూ, మలయప్ప స్వామి మెల్ల మెల్లగా ఉయ్యాల తాగుతూభక్తులకు దర్శనమిస్తారు. ఈ సేవ లో దేవ దేవున్ని దర్శించినభక్తునకు సత్సంతానం కలుగుతుంది.

11. ఏకాంత సేవ

తిరుమల శ్రీ వారి ఆలయం లో చివరగా జరిగే సేవ ఏకాంత సేవ. ఈసేవ లో స్వామి వారు బంగారు పట్టె మంచం లో శయన మూర్తి గాదర్శన మిస్తారు. శ్రీ వారి పరమ భక్తురాలయిన మాతృ శ్రీవెంగమాంబ ముత్యాల హారతి ని స్వామి వారికి సమర్పిస్తారు.అన్నమా చార్యుల వారి జోల పాట ను పాడి ఆ నాటి సేవలనుముగిస్తారు.     

అన్ని సేవలలోనూ భక్తులు ఎంతో  ఉత్సాహం గా పాల్గొన్నారు. రథోత్సవం, తోమాల సేవ, సహస్ర దీపాలంకార సేవల్లో పాల్గొన్న అందరిలో ఆనందం వెల్లివిరిసింది. ఇక శ్రీనివాస కల్యాణోత్సవం అంగ  రంగ వైభవం గా జరిగింది. స్వామి వారి పాదాలకి భక్తులు అభిషేకం చేసి ధన్యులయ్యారు!! చివరిగా పూర్తి చీకటిలో, కేవలం కొన్ని దీపాల వెలుగులో, స్వామి వారి ఏకాంత సేవ చేశారు అర్చకులు. అన్ని సేవలనూ ఒకే రోజు చూడగలిగిన భాగ్యం దక్కినందుకు భక్తులు చాలా పరవశించారు. 

ఈ విధం గా ఆరిజోనా లో మొట్ట మొదటి సారిగా "ఉదయాస్తమాన సేవలు" అత్యద్భుతం గా జరిగాయి. 

                                                                                                                                                                                                                         - రాధికా కామేశ్వరి